Copy of అందరూ చదవాలి

"రైతు బాంధవుడు"-


కంప్యూటర్లూ, సాఫ్ట్వేర్ల గురించి మాత్రమే అంతా ఆలోచిస్తున్న ఈ ఆధునిక యుగంలో... ప్రియురాలి వంటి పట్నాన్నే కాదు... తల్లివంటి పల్లెను కూడా తలచుకోవాల్సిన అవసరం ఉందనుకున్నాడో వ్యక్తి! అనుకోవడమే కాదు, అకుంఠిత దీక్షతో నెలల తరబడి గ్రామాల వెంట తిరిగాడు. ఎక్కడ సమస్య ఉంటే అక్కడికి వెళ్లాడు. అందుకు కారణమైన లోతుల్ని తరచిచూశాడు. అక్షరబద్ధం చేశాడు. పాలకుల, ప్రజల దృష్టికి తెచ్చాడు. ఆయనే పాలగుమ్మి సాయినాథ్‌. ఈ ఏడాది రామన్‌ మెగసెసే అవార్డు విజేత.
* * *
ప్రఖ్యాతిగాంచిన ఆర్థిక వేత్త, నోబెల్‌ పురస్కార గ్రహీత అమర్త్యసేన్‌ మాటల్లో చెప్పాలంటే ఆకలి, దుర్భిక్షంపై ప్రపంచంలోనే అత్యంత లోతుగా అధ్యయనం చేసిన నిపుణుల్లో సాయినాథ్‌ ఒకరు.
***
'దేశం మొత్తం మీదా గత పదేళ్లలో దాదాపు లక్ష మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. కానీ అందుకు కారణమైన ఒక్క అధికారికి కూడా కనీస శిక్షపడలేదు' అన్న సాయినాథ్‌ మాటలు కఠినంగా అనిపించొచ్చుగానీ అవి అక్షర సత్యాలు.
***
ఇన్ని మాటలెందుకు... పాలమూరు వలసలూ, అనంతపురంలో రైతుల ఆత్మహత్యలూ అంతర్జాతీయ సమాజం దృష్టికి రావడానికి ఆయన రచనలే కారణం. వలస కూలీలుగా మారిన మహబూబ్‌నగర్‌ జిల్లా రైతులు 2000సంవత్సరంలో వారానికి ఒక బస్సులో ముంబాయి వెళ్లేవారు. 2004కి ఆ సంఖ్య 34బస్సులకు పెరిగింది. ఈ విషయాన్ని గుర్తించి ప్రపంచానికి చెప్పింది సాయినాథే.
***
పాముకాటుతో రైతులు మరణించడానికీ, ఆర్థిక సరళీకృత విధానాలకూ, తీవ్రవాదానికీ సంబంధం ఉందంటే ఎవరూ నమ్మకపోవచ్చు. కానీ సాయినాథ్‌ పరిశోధనలో ఈ మూడింటికీ సంబంధం ఉందని తేలింది. తెల్లవారు జామున ఏ మూడింటికో కరెంటు ఇస్తోంది ప్రభుత్వం. మోటారు స్విచ్‌ వేయడానికి రాత్రిళ్లు పొలానికి వెళ్లిన రైతులు పాముకాటుకు గురైతే విరుగుడు మందు దొరకట్లేదు. పీపుల్స్‌వార్‌ నుంచి ఎల్టీటీఈ దాకా పాముకాటు మందును పెద్దఎత్తున కొనుగోలు చేసి నిల్వ ఉంచుకోవడమే దానికి కారణమని తేలింది. ఈ చేదునిజం గురించి 2001లో ఆయన రాసిన కథనం అంతర్జాతీయంగా ప్రచురితమైంది.
***
'ముంబాయిలో లాక్మే ఫ్యాషన్‌షో జరిగితే అధిక సంఖ్యలో అక్రిడేటెడ్‌ జర్నలిస్టులు హాజరయ్యారు. జాతీయ పత్రికలు, టెలివిజన్‌ ఛానళ్లలో ప్రముఖంగా ప్రచారం ఇచ్చారు. కనీస వేతనాల కోసం లక్షల మంది వ్యవసాయ కూలీలు ఢిల్లీలో ఆందోళన చేస్తే ఎవరూ పట్టించుకోలేదు' అంటూ నిశితంగా విమర్శించారు. భారతదేశంలోని పత్రికలు పైనున్న ఐదుశాతం మంది గురించి పట్టించుకుంటే, తాను కింది నుంచి ఐదుశాతం మంది కోసం రాస్తానని బహిరంగంగానే ప్రకటించారు.
***
అలాగే... 'బీహార్‌లోని గొడ్డా జిల్లా లాల్మతియా గ్రామంలో ఓ వ్యక్తి మూడు బొగ్గుమూటల్ని సైకిల్‌మీద పెట్టుకొని అతి కష్టంగా లాక్కుని వెళ్తున్నాడు. మూడు క్వింటాళ్ల బరువుంటాయవి. అతనికి సాయం చేద్దామని ఐదునిమిషాలు తోయగానే అలసిపోయాన్నేను. కానీ అదే బరువుతో రోజూ 40కి.మీ. దూరం ప్రయాణించి వాటిని అమ్ముకుంటాడు అతను. అందుకు ముట్టే ప్రతిఫలం రూ.10. ఆ ప్రాంతంలో దాదాపు మూడువేల మందికి అదే ఆధారం' అని చెబుతారు సాయినాథ్‌. వినడానికే గుండెలు తరుక్కుపోయే ఇలాంటి ఎన్నో దృశ్యాలను చూశారాయన. ఆ ఆవేదన నుంచి పుట్టిన ఆవేశం, పదును ఆ కలంలో కనిపిస్తాయంటే ఆశ్చర్యమేముందిక!

Labels: ఆర్థిక సరళీకృత విధానాలు, పాలగుమ్మి సాయినాథ్,

రామన్ మెగసెసే అవార్డు విజేత